నా చిన్న తనంలో నవంబరు 1, రాగానే ఎంతో సంతోషంగా ఉండేది. నా పుట్టిన రోజు, నవంబరు 15న కావడంతో, దగ్గర పడుతుందన్న ఆనందం. అమ్మ కొత్త బట్టలు, కారప్పూస, బెల్లం గవ్వలు, మిగిలిన వాటి తయారిలో ఉండేది. ఆ రోజు మాకు సెలవు కూడా. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కదా. పొట్టి శ్ర్రీరాములు గారు చేసిన త్యాగం, టంగుటూరి ప్రకాశం గారి గొప్పతనం, ముఖ్యమంత్రిత్వం గురించి ప్రతి ఏడాదీ వినే వాళ్లం. రేడియోలో “మా తెలుగు తల్లీకి…” ఓ పది సార్లు మారుమోగేది. నిజానికి ఇవన్నీ అక్టోబరు 1న గుర్తు చేసుకోవాలి. రష్యా వారు అక్టోబరు ఫెస్ట్ నవంబరులో జరుపుకున్నట్టు, అక్టోబరుని మర్చిపోయి నవంబరులో అన్ని గుర్తు చేసుకొనేవారు.
మా అమ్మ మే 1954లో పుట్టింది. అక్టోబరు 1, 1953న ఆంధ్ర రాష్త్ర అవతరణ జరిగింది. అందుచేత, మా తాతగారు మా అమ్మకి “ఆంధ్ర జయశ్రీ” అని పేరు పెట్టారు. మా అమ్మని అందరూ జయశ్రీ అని పిలిచినా ఆయన మాత్రం ఆంధ్రుడూ అని ముద్దుగా పిలుచుకునేవారు. మా అమ్మ పేరులో ఉండడం వల్ల నాకు ఆంధ్ర అనే పదం చాలా ఇష్టం.
కొంచెం వయసు వచ్చింతరువాత ఆ పదం యొక్క చరిత్ర తెలుసుకున్నాను. మహాభారత యుధ్ధంలో ఆంధ్రులు కౌరవుల తరపున పోరాడరని, మౌర్యులు బలహీనం ఆయ్యే సమయానికి, అటు పాటలిపుత్ర నుండి ప్రస్తుత మహరాష్ట్ర, తెలంగాణ దాక ఆంధ్రులు ఎన్నో శతాబ్దాలు పరిపాలించారని తెలుసుకున్నాను.
ఆనాటి ఆంధ్రులు తెలుగు మాట్లాడిన సూచనలు ఎక్కడా లేవు మరి. వారి శిలా శశనాలన్నీ ఇతర భాషల్లోనే దొరికాయి. మరి తెలుగువారు ఉంటున్న ప్రాంతానికి ఆంధ్రా పదనికి సంబంధం నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అంధకారణ్యం ఆంధ్రగా మారింది అని ఒక ఆలోచన.
స్వతత్ర్యం వచ్చే నాటికి, తెలుగు వారు ఉండే ప్రాంతాన్ని (హైదరబాదుని మినహాయిసస్తే) ఆంధ్రా ప్రాంతమనే అనేవారు. ఆ నాటికి మద్రాసు ప్రెసిడెంంసిలో ఒక భాగంగా పరిపాలించేవారు. అధికారంలో తమిళవారు ఉండడంతో తెలుగువారికి నష్టం జరుగుతుందని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి పోరాటం చేసి తెచ్చుకున్నదే ఆంధ్ర రాష్ట్రం. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి, ప్రాణం కోల్పోయింతరువాత గాని అప్పటి ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలేదు. ఇంచుమించుగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అప్పటి ఆంధ్ర. దాని అవతరణ అక్టొబరు 1, 1953న జరిగింది.
అప్పటికే తెలంగాణాలో సాయుధ పోరాటం, రజాకార్లు చేసిన విధ్వంసం అన్నీ జరిగి, హైదరాబాదు, భారత దేశంలో ఒక భాగం అయ్యింది. అయితే అక్కడ, తెలుగువారు, కన్నడవారు, మరాఠివారు అందరూ ఉండే వారు. 1956, నవంబరు 1న భాషని ఆధారంగా చేసుకొని రాష్ట్ర విభజన చేసి ప్రస్తుత కర్ణాటక, మహారాష్త్ర మిగిలిన రాష్ట్రాలన్నీ అవతరించాయి. ఆంధ్ర, హైదరాబాదు తెలుగు ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది. హైదరాబాదు నగరం రాజధాని అయ్యింది. అలా నేను నరసాపురంలో పుట్టి, హైదరాబాదులో పెరగడంతో నా రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అనే చెప్పుకునే వాళ్ళం. 1 నవంబరు అందుకే సెలవు.
తెలుగువారు మద్రాసు నుండి ఎలా వేరు పడదామనుకున్నారో అలాగే తెలంగాణా ప్రాంతం వారు ప్రత్యేక తెలంగాణ కోసం 1970 దశాబ్దం నుండి పోరాడితే మొత్తనికి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణని సాధించారు. అదే రోజున ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ వెలుగులోకి వచ్చింది. నా లాంటి వారు తెలంగాణా వారా లేక ఆంధ్రా వారా అన్న ప్రశ్న మిగిల్చారు. రెండూ మనవే అనుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి ప్రభుత్వం ప్రాచీన అమరావతిని మళ్లీ వెలుగులోకి తీసుకు రావలని, కొత్త అమరావతిని శ్రుష్టించి రాజధాని చేస్తామన్నారు. చాలా ప్రయత్నం చేసారు కూడా. రెండో ప్రభుత్వం అలా కాదని, మూడు రాజధానులు కావాలని, విశాఖపట్ణంలో ప్రజలు ఎంతో ఆదరించే రుషికొండని నాశనం చేసారు. మళ్లీ ఇప్పటి ప్రభుత్వం, తిరిగి అమరావతిని అభివ్రుధ్హి చేస్తున్నారు.
అయితే ఆంధ్ర ప్రదేశ్ వారు, అక్టోబరు 1, నవంబరు 1, జూన్ 2 లలో ఏ తేదీకి ప్రాముఖ్యత ఇవ్వలేక పోతున్నారు. టంగుటూరి వారి కుమార్తె సూర్యకుమారి గారి “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” అనే పాట మెల్లెగా మర్చిపోతున్నారు. ఈ తేదీలన్నీ చరిత్ర పుటల్లో మిగిలిపోయాయి.