ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న గిడుగు రామమూర్తిగారి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏటా ఇలా పండుగ జరుపుకుంటాము.
ఇది తెలుగులో నా మొదటి వ్యాసం. చిన్నప్పటి నుండీ ఇంగ్లీషు చదువులు, అమెరికాలో 17 ఏళ్లు ఉండి తిరిగి రావడంతో తెలుగులో ఏదన్నా రాయాలంటే కొంత భయము. ఇప్పటికైనా ధైర్యం చేద్దామని ఇది మొదలు పెట్టాను. బడిలో చదువుకోవడం ఎటూ చెయ్యలేదు. పైగా mathematics పిచ్చి. దానితో Equation అర్థం చేసుకుంటే సరి పోతుందని ఒక నమ్మకం. పది పదాలని క్లుప్తంగా ఒక చిన్న equation గా మార్చ వచ్చు. అందుచేత నవలలు, గ్రంధాలు చదవడానికి (ఏ భాషైనా) ఓపిక ఎప్పుడూ తెచ్చుకోలేదు. మరి తెలుగు ఎలా నేరుచుకున్నానా? చిన్నప్పుడు చందమామ కథలు, తరువాత పాత సినిమాలు. భాష మీద మక్కువ ఉండడంతో ఆరుద్రగారి సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర లాంటివి కొన్ని కొంత చదవడం జరిగింది. ఒక నవల, “కాలాతీత వ్యక్తులు" సగం చదివాను. ఇదీ నా తెలుగు పరిజ్ఞానం.
అందుకని తఉక్ష: తప్పులు ఉంటే క్షమించండి. పైగా, ఇది నా వ్యవహారిక భాష.
గిడుగువారు ఒక భాషా శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త. ఆ నాటికి, తెలుగు రాయడానికి కేవలం గ్రాంధిక భాష వాడేవారు. అప్పటికే బహుశా జనాభాలో అతి తక్కువ శాతం అర్థం చేసుకునేవారు. కేవలం చదువుకున్నవారు (అంటే అధిక వర్గాల వారు) మాత్రమే. ఈ రొజుల్లో ఇంగ్లీషు చదువుల వల్ల, గ్రాంధికం కాదు కదా, మాములు (వ్యావహారిక) భాష కూడా అర్థం చేసుకునే వారు అరుదు అయిపోయారు. ఆయన వ్యావహారిక భాష అంటే మాములు జనాలు వాడే భాష రాతకు ఉపయోగించాలని ఎంతో కృషి చేసారు. అందుకనే ఆయనకి ఈ గౌరవం. అలాగే సవర భాషకి లిపి, వ్యాకరణం కూడా ఆయన సమకూర్చారు. సవర పేరుతో రెండు భాషలు ఉన్నాయంట. ఒకటి ద్రావిడ భాష, అంటే తెలుగు, తమిళ భాషలకి అక్కా-చెల్లి లాంటిది. గిడుగువారు పని చేసింది ముండా భాషలకి చెందిన సవర భాష.
రామాయణంలో శబరి, సవర తెగకి సంబంధించిందని తెలుగు వారి నమ్మకం. అదే నిజమైతే, శబరి ద్రవిడ లేక ముండా తెగలకి సంబంధించనదనే అనుకోవాలి. ఆశ్చర్యం చెందవలసిన విషయమూ కాదు.
అసలు విషయానికి వద్దాం. వ్యావహారిక భాష అంటే ఏమిటి? ఆ రోజుల్లో అయినా, ఈ రోజుల్లో అయినా. చిన్నప్పుడు తెలుగు అంటే నన్నయగారి భారతమో లేక తిక్కనగారి భారతమో అనే అనుకునే వాడిని. కొంత వయసు వచ్చి, భాషల మీద కొంత అవగాహన వచ్చింతరువాత, నా అభిప్రాయం మార్చు కున్నాను. మొదటిలో అచ్చ తెలుగు కవిత్రయం రాసిన మహాభారత భాష అని, తరువాత మా అమ్మమ్మగారి తల్లి (బడికి వెళ్లకుండా కేవలం తెలుగు వచ్చిన మనిషి) మాట్లాడిన భషే అచ్చ తెలుగని అనుకునే వాడిని. ఇప్పుడు నన్నడిగితే, అసలు అచ్చమైన భాష కోసం వెతకడమే తప్పు అంటాను. Hitler was looking for a pure race. Looking for a pure language is equally foolish. భాష అనేది ప్రతి రోజూ మారుతుంది. ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాతానికి మారిపోతుంది.
మరి ఎవరి భాషని వ్యవహారిక భాష అన వచ్చు. ఇది చాలా కష్టమైన ప్రశ్నే. పైగా రాత రాస్తే రెండో మనిషికి కూడా అర్థం అవ్వాలి. నా భాష నాదీ అని పట్టుదల ఉంటే, భాష ప్రయోజనమే కోల్పోతుంది. భాష ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడానికి కనిపెట్టిందే కదా. మరి వ్యవహారిక ఎలా ఎన్నుకోవాలి?
ఆ రోజుల్లో రాజ సభల్లో అర్థమైతే చాలు అనుకున్నరు. అక్కడ తెలుగుతో పాటు సంస్కృతం వచ్చిన వారు ఉండే వారు. అందుకని తెలుగు మాహాభారతంలో చాలా వరకు సంస్కృతం ఉండేది. పైగా అటువంటి తెలుగు సాహిత్యానికి మూలం చాలా వరకు సంస్కృత గ్రంధాలే.
రాను రాను, చదువుకున్నవారు మాట్లాడడానికి వాడే భాషను వ్యావహారిక భాష అనారు. ఆ రోజుల్లో, అధిక వర్గాల వారు చదువు చెప్పేవారు. తక్కువ వర్గాల వారు, వారి యాస మార్చుకొని ఒక రకమైన “బడి భాషకి" అలవాటు పడారు. నా లాంటి వాళ్లు, మూడు తరాలనుండి, మా పూర్వీకుల భాష-యాస మర్చిపోయి "బడి భాష"ని అలవాటు చేసుకున్నాం. దీని వల్ల సంఘంలో ఒక “గౌరవం” దక్కుతుందని కూడా ఒక నమ్మకం. అందుకనే, నా (పూర్వీకుల) భాషని తెలుసుకోవాలంటే మూడు తరాల వెనక్కి వెళ్ళాను.
ఇక్కడ, మా ఇంట్లో అనే ఒక మాట గుర్తుకి వచ్చింది. వ్రత్తబోయి పిత్తబోయారని. చదవడానికి కొంత ఇబ్బంది అయినా, సరైనా అర్థం రావాలంటే అలా అనడం బాగుంటుంది. వచ్చీ రానీ చదువులతో కొందరు వత్తులు లేని చోట కూడా వత్తులు పెడతారని హేళన చేయడమే ఆ నానుడి ఊద్దేశ్యం. నిజానికి, అది చదువుకున్నవారు మొదలు పెట్టిందే. రాతను వ్రాతగా, కొత్తను క్రొత్తగా, ఇలా ఎన్నో తెలుగు (వాడుక) పదాలను వత్తులు కలిపి సంస్కృతానికి దగ్గరగా చేసారు. చదువు అప్పుడే నేర్చుకున్నవారు వత్తులు అనవసరంగా పెట్టడం తప్పేమీ కాదు.
ఇది ఇలా ఉంటే, ఈ తరంలో, రాతలే తక్కువ అవ్వడంతో, సినిమా భాష ముందుకి వచ్చింది. చిన్నప్పుడు సినిమాలు తెలుగుని తగలేస్తున్నాయని అనుకునే వారు. నేను, ఈ రోజున, తెలుగుని కాపాడేదీ సినిమాలని అంటాను. తెలుగు సినిమా మొదలయ్యింది కొన్ని వర్గాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే. అందుకని ఆ రోజుల్లో వారు వాడిన భాషే సరైన తెలుగని ఒక అపోహ ఉండేది.
కొంత కాలం తరువాత కొన్ని ప్రాంతీయ భాష-యాసలని effect కోసం సినిమాలలో వాడడం మొదలు పెట్టారు. ఇక్కడ కొంత అన్యాయం కూడా జరిగింది. తెలంగాణ, రాయలసీమ భాషలు కేవలం ప్రతి నాయకులు (villains) మాత్రమే వాడేవారు. తరువాత కాలంలో, అది తెలుగో కాదో అనే హైదరాబదు భాష వాడడం మొదలుపెట్టారు. మరి వీటన్నిటిలో ఏది వ్యావహారికం? నాకు అంతు పట్టడం లేదు.
తెలంగాణ-ఆంధ్ర విభజన చాలా మందికి (నాతో కలిపి) ఇబ్బంది కలిగింది (చాలా వరకు ఇది మానసికం). అయితే విభజన వల్ల ఒక మంచి తప్పకుండా జరిగింది. పైగా OTT వల్ల కూడా కొంత లాభం జరిగింది. ఈ మధ్య ఎన్నో మంచి సినిమాలు, అన్ని పాత్రల చేతా ఒక ప్రాంతీయ భాష వాడించారు. ఉదాహరణకి, బలగం తెలంగాణ, కొండ పొలం, సినిమా బండి రాయలసీమ యాసలు వాడి జనాలని ఆకట్టు కున్నాయి. ఈ మధ్య వచ్చిన mega blockbuster పుష్ప కూడా రాయలసీమ యాసను చక్కగా చూపించారు.
అదండీ సంగతి. అచ్చ తెలుగు కోసం వెతకడం ఎంత తప్పో, ఒకే వ్యావహారిక భాష కోసం వెతకడం అంతే తప్పు. AI machine అర్థం చేసుకుంటుందో లేదో గానీ, మనుషులు వేరు వేరు ప్రాంతీయ భాషలను పెద్దంత తడబడకుండా అర్థం చేసుకుంటారు. అన్ని మాండలికాలూ వ్యావహారిక భాషలే.